loading
0%25,Aug-2026
ఆదోని, ఆగస్టు 24: ఆదోని-ఆలూరు రోడ్డులోని సెమియా తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల విలువైన సామగ్రి, సెమియా తయారీకి ఉపయోగించే వస్తువులు కాలిపోయినట్లు బాధితులు బాష, షకాంబి దంపతులు తెలిపారు.
బాష, షకాంబి దంపతులు సెమియా తయారీ కేంద్రం నిర్వహిస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ కేంద్రం వారి కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కేంద్రంలోని సామగ్రి, తయారు చేసిన సెమియా తదితర వస్తువులు కాలిపోయాయి.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో బాష, షకాంబి దంపతులు తీవ్రంగా నష్టపోయారు.
నలుగురు చిన్నారులను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న తమను ఆదుకోవాలని బాష, షకాంబి దంపతులు కోరారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆర్థిక సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, స్థానికులు కూడా తమవంతు సహకారం అందించాలని పలువురు కోరుతున్నారు.